: అభయ్ కిడ్నాప్, హత్య జరిగిన తీరు ఇది!: సీపీ మహేందర్ రెడ్డి
పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసు జరిగిన విధానాన్ని, నిందితుల వివరాలను హైదరాబాదు సీపీ మహేందర్ రెడ్డి వివరించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘శేషుకుమార్ అలియాస్ సాయికి రవి, మోహన్ స్నేహితులు. సాయి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన వ్యక్తి. రవి శ్రీకాకుళంకు చెందిన వాడు కాగా, మోహన్ ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. వృద్ధులకు సేవలు చేసేందుకు వ్యక్తులు కావాలంటూ గతంలో హైదరాబాదులోని కార్తీకేయ ఫౌండేషన్ ఒక ప్రకటన ఇచ్చింది. దీంట్లో పనిచేసేందుకు సాయి అప్లయ్ చేయడం, జాబ్ లో చేరడం జరిగింది. ఇదే సంస్థ తరపున గ్యాన్ బాగ్ కాలనీలో ఉన్న హనుమాన్ దాస్ ఇంట్లో ఉంటూ, సుమారు ఆరు నెలల పాటు ఆయనకు సేవలు చేస్తూ ఆ కాలనీలోనే సాయి నివసించాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మెలిగిపోయాడు. అక్కడ ఉన్న పిల్లలందరితో సాయికి పరిచయం ఏర్పడింది. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో, ఫేస్ బుక్ ద్వారా అప్ కమింగ్ సినీ యాక్టర్ బాబూ పాల్ తో సాయికి పరిచయం ఏర్పడింది. తాను కూడా ఒక నటుడిని కావాలని బాబూ పాల్ తో సాయి చెప్పాడు. యాక్టింగ్ స్కూల్ లో చేరాలని, అందుకు డబ్బులు బాగా అవసరమవుతాయని బాబూ పాల్ సాయికి చెప్పాడు. గతంలో రాంచీలో పనిచేసినప్పుడు రవి, మోహన్ లతో సాయికి పరిచయముంది. ఈ ముగ్గురు కూడా యాక్టర్లు అవుదామని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 18న హైదరాబాద్ కు వచ్చి షాయినాజ్ గంజ్ ఏరియాలో ఒక హోటల్ లో 3 రోజులు ఉన్నారు. ఆ తర్వాత హిందీ నగర్ లో రెండో ఫ్లోర్ లో రూ.7,000 కు ఒక గది అద్దెకు తీసుకున్నారు. అయితే, సాయి మాత్రం అప్పడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు. ఇదిలా ఉంచితే, ఈనెల 9న మాత్రం హనుమాన్ దాస్ వద్ద నుంచి సాయి బయటకు వచ్చేశాడు. తమ ఊరు వెళుతున్నానని ఆయనకు చెప్పాడు. ఆ తర్వాత హిందీనగర్ లో తీసుకున్న రూమ్ లో ఆ ఇద్దరితో కలిసి సాయి ఉండేవాడు. అదే సమయంలో 'ఒక రొమాంటిక్ క్రైమ్' అనే చిత్రాన్ని ఈ ముగ్గురు యూట్యూబ్ లో చూశారు. ఈ సినిమాలోలా తాము కూడా ఏదైనా నేరం చేసి డబ్బులు సంపాదించాలని, యాక్టింగ్ స్కూల్ లో చేరి, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఒక పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే అభయ్ గురించి సాయి తన మిత్రులకు చెప్పడం జరిగింది. తమకు బాగా డబ్బు ఉన్న విషయాన్ని అభయ్ గతంలో సాయికి చెప్పాడు. ఈ విషయాన్ని సాయి తన మిత్రులకు చెప్పాడు. దాంతో, అభయ్ ను కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయాలని పథక రచన చేశారు. ఈ నేపథ్యంలో బేగంబజార్ ఏరియాకు వెళ్లి ఒక ప్లాస్టర్ కొనుక్కుని వచ్చారు. అభయ్ తండ్రితో మాట్లాడడం కోసం ఫ్రెష్ సిమ్ కార్డులు కూడా కొనుగోలు చేశారు. మార్చి 16 వ తేదీన గ్యాన్ బాగ్ కాలనీ సమీపంలో అభయ్ కోసం ఎదురుచూస్తూ సాయి నిలబడ్డాడు. ఆ రోజు సాయంత్రం 4.49 గంటలకు మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ కు అభయ్ తన వాహనంపై వచ్చాడు. టిఫిన్ లు కొని ఇంటికి వెళుతుండగా అభయ్ సాయికి కనిపించాడు. తనకు లిఫ్ట్ ఇవ్వమని, తమ గది ఇక్కడికి సమీపంలోనే ఉందని సాయి అతనికి చెప్పాడు. లిఫ్ట్ ఇచ్చిన అభయ్ వాహనం నడుపుతుండగా, అతనికి తన ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో, వాహనం డ్రైవ్ చేస్తానని చెప్పి సాయి తీసుకున్నాడు. హిందీనగర్ లోని సాయి గది వద్దకు చేరుకున్నారు. సాయి తన గదిలోకి వెళ్లిపోగా, ఆ తర్వాత అభయ్ తన వాహనాన్ని పార్క్ చేసి అతను కూడా ఆ గదిలోకి వెళ్లాడు. ఆ గదిలో ఉన్న మిగతా ఇద్దరు వ్యక్తులను అభయ్ కు సాయి పరిచయం చేశాడు. ఒక కూల్ డ్రింక్ కూడా అభయ్ కు ఇచ్చారు. ఆ తర్వాత అభయ్ ను కిడ్నాప్ చేస్తున్న విషయాన్ని అతనికి సాయి చెప్పాడు. ఎందుకని అభయ్ ప్రశ్నించగా, తాము సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నామని అందుకే, కిడ్నాప్ చేశామని సాయి అతనికి చెప్పాడు. డబ్బులు అడిగితే మా నాన్న ఇస్తాడని, తనను కిడ్నాప్ చేయవద్దని అభయ్, సాయితో చెప్పడం జరిగింది. కావాలంటే మా వాళ్లతో మాట్లాడుకోవాలంటూ అభయ్ తన అత్తయ్య ఫోన్ నంబర్ ను కిడ్నాప్లరకు ఇచ్చాడు. అభయ్ ఎటువంటి గొడవ చేయకపోయినప్పటికీ, అంతకుముందు చూసిన సినిమా ప్రభావం కారణంగా, అతని నోటికి ప్లాస్టర్ వేసారు. ముక్కుపై నుంచి ఈ ప్లాస్టర్ వేయడం తో అతనికి గాలి ఆడలేదు. ఆ తర్వాత అభయ్ వాహనాన్ని తీసుకువెళ్లి సమీప ప్రాంతంలో పడేసి వచ్చిన వారు, అభయ్ కదలడం లేదేమిటని చూసారు. ప్లాస్టర్ తీసేసి అతన్ని కదిలించి చూశారు. కానీ, అప్పటికే అతను చనిపోయాడు. దాంతో, ఈ డెడ్ బాడీని ఒక అట్టపెట్టెలో పెట్టి పడేద్దామని ఆలోచించారు. తమ ఓనర్ల వద్ద ఉన్న అట్టపెట్టెను తీసుకుని, అందులో అభయ్ శవాన్ని ఉంచి, ఒక ఆటో ట్రాలీలో సికింద్రాబాద్ కు తరలించారు. అయితే, ఆ హడావిడిలో కొత్తగా తీసుకున్న సిమ్ కార్డులను ఇంట్లోనే మర్చిపోయారు. మళ్లీ కొత్త వాటిని కొనుగోలు చేసేందుకని చెప్పి జగదీష్ మార్కెట్ కు బయలుదేరుతుండడంతో, ఆటో ట్రాలీ అతను ఆలస్యమవుతోందని చెప్పడంతో, అందులో నుంచి ఆ బాక్స్ ను కిందకు దించి అతన్ని పంపివేశారు. తర్వాత ప్యాసింజర్ ఆటోలో ఆ శవం ఉన్న బాక్స్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఆ బాక్సును రైలులో తమ వెంట తీసుకువెళుతూ, అభయ్ తండ్రి నుంచి డబ్బులు డిమాండ్ చేద్దామనుకున్నారు. కానీ, రైల్వేస్టేషన్ పార్కింగ్ ఏరియా వద్దకు తాను రావడానికి పర్మిషన్ లేదంటూ ఆటో డ్రైవర్ చెప్పడంతో, తప్పనిసరి పరిస్థితులలో ఆ బాక్సును ఆల్ఫా హోటల్ సమీపంలో పడేశారు. తర్వాత వీరి వద్ద ఐడీ ప్రూఫ్ లు లేకపోవడంతో, అక్కడ ఉన్న ఒక వెండర్ ను బతిమిలాడి, ఎక్కువ డబ్బులు ఇచ్చి సిమ్ కార్డులు తీసుకున్నారు. నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లేందుకు మూడు టికెట్లు నిందితులు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి అభయ్ తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు’ అని సీపీ మహేందర్ రెడ్డి వివరించారు. అభయ్ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి కేవలం 48 గంటల్లో కేసును ఛేదించామన్నారు. నిందితులు విజయవాడ చేరుకుని, అక్కడ సెల్ ఫోన్ వదిలేశారని, విజయవాడ లో హౌరా ఎక్స్ ప్రెస్ ఎక్కి నిందితులు ఇచ్ఛాపురం, బరంపురం చేరుకున్నారని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఆ తర్వాత తమ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను రోడ్డు మార్గంలో ఇక్కడికి తీసుకువచ్చారని, నిందితులను త్వరలో కోర్టులో ప్రవేశపెడతామని మహేందర్ రెడ్డి చెప్పారు.