: బేగంపేటలో ఏవియేషన్ షో, సందర్శకుల నిరుత్సాహం!


హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను సందర్శించేందుకు రెండు రోజుల పాటు ప్రజలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, రూ.300 తో టిక్కెట్టు కొని వెళ్లిన సందర్శకులకు నిరాశే మిగులుతోంది. ఈ షోలో చెప్పుకోదగ్గ విమానాలు, హెలీకాఫ్టర్లు లేకపోవడమే ఇందుకు కారణమని సందర్శకులు వాపోతున్నారు. ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్ కావడంతో నిన్న, ఈరోజు సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంది. ముఖ్యంగా పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విమానంలో ప్రయాణం చేసే స్తోమత లేనివారు, కనీసం విమానం ఎట్లా ఉంటుందో చూద్దామని, తమ పిల్లలకు చూపిద్దామని వస్తే, కనీసం విమానాల వద్దకు అనుమతించడం లేదని వారు వాపోయారు. రెండు, మూడు చిన్న విమానాలు, హెలికాఫ్టర్లు మాత్రమే ఉన్నాయని, విదేశాలకు చెందిన విమానాలేవీ లేవని, ఈ షో నచ్చలేదని అన్నారు. రకరకాల విమానాలు చూపించవచ్చని, వాటిలోకి ఎక్కవచ్చని ఆశించి వస్తే ఎంతో నిరాశ ఎదురైందని, కనీసం విమానాల వద్ద నిలబడి సెల్ఫీ తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికీ రూ.300 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి వచ్చామని, ఉపయోగమే లేకుండా పోయిందని, అధికారుల నిర్వహణా లోపం బాగా ఉందని సందర్శకులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News