: 'పరువు హత్య'లు చేసిన వారికి సహాయం చేస్తానంటున్న లాయర్...స్పందించిన పోలీసులు
పరువు హత్యలు చేయడం తప్పుకాదని, ఒకవేళ చేసినవారు తన వద్దకు వస్తే, ఏమీ కాకుండా చూసుకుంటానని చెబుతూ తమిళనాట విల్లుపురానికి చెందిన టీఎస్ అరుణ్ కుమార్ అనే న్యాయవాది తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టడం కలకలం రేపింది. ఈ పోస్టుతో పాటే తన ఈ-మెయిల్ ఐడీని కూడా ఆయన పోస్ట్ చేశాడు. "పరువు తీసినందుకు వేసే శిక్షే పరువు హత్య. ఇంటి పరువు తీసిన వారిని హత్య చేసే హక్కు తల్లిదండ్రులకు వుంది. ఇలాంటి హత్య చేసిన వారు ఏమీ బాధపడొద్దు. నా వద్దకు రండి. మీ కేసు నేను తీసుకుంటాను. అదేమీ నేరం కాదు" అని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన సామాజిక కార్యకర్త గీతా నారాయణన్, చెన్నై పోలీసు కమిషనర్ కు దాన్ని ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆయన ఖాతాను మూసివేయించి నోటీసులు పంపారు. కాగా, తమిళనాడులో పరువు హత్యలకు మద్దతిస్తున్నవారి సంఖ్య వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. గత వారంలో కౌసల్య ప్రాంతంలో అగ్రకుల యువతిని వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ, ఓ దళిత యువకుడిని కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్య చేసిన వారిని అభినందిస్తూ, వందలాది మంది పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. 2013 నుంచి తమిళనాట 80 మంది యువతీ, యువకులను పరువు పేరిట వారి సొంత బంధువులే హత్యలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.