: తెలంగాణలోని రూ. 70 వేల కోట్ల ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు సర్కారు!
ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విద్యా మండలి ఆస్తుల్లో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణకు చెందుతాయని సుప్రీం తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అదనుగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్స్ 9, 10లో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఆస్తుల్లో వాటాను కోరేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. షెడ్యూల్ 9, 10లో దాదాపు 120 ఇనిస్టిట్యూషన్స్ పేర్లు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ సర్కారు తన అధీనంలోకి తీసుకుంది. వీటన్నింటి ఆస్తుల విలువ లెక్క తీస్తే, దాదాపు రూ. 1.30 లక్షల కోట్లకు పైగా ఉండగా, వాటిల్లో తన వంతు 58 శాతం వాటాగా కనీసం రూ. 70 వేల కోట్ల విలువైన ఆస్తులు దక్కుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల్లో విభజనకు ముందున్న నగదులో సైతం ఏపీకి వాటాను ఇవ్వడం, మండలి ఫిక్సెడ్ డిపాజిట్లలో వాటా ఇవ్వడంతో, మిగతా సంస్థల విషయంలోనూ బ్యాంకు ఖాతాలపై హక్కులను అడగాలని ఏపీ భావిస్తోంది. షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి దాదాపు రూ. 3,800 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు తెలుస్తోంది. "సుప్రీంకోర్టు వెల్లడించినట్టు 58 శాతం వాటా ఏపీకి వస్తే దాదాపు రూ. 70 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయి. ఇదే జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఓ పెద్ద విజయాన్ని సాధించినట్టు" అని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కాగా, ఈ 120 సంస్థల వివరాలు, వాటి ఆస్తులను లెక్కించేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో అత్యధికం హైదరాబాద్ నగరంలో ఉండగా, ప్రస్తుతం దాదాపు అన్ని సంస్థలూ తెలంగాణ ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయి. సుప్రీంకోర్టు రూలింగ్ తో ఏపీ అవకాశాలు పెరుగగా, విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ సర్కారు మరో అప్పీలు చేయాలని భావిస్తోంది. విభజన తేదీ జూన్ 2కు ముందు ఏర్పడ్డ అన్ని సంస్థల్లో ఏపీకి వాటా దక్కితే, ఆర్థికంగా రాష్ట్రానికి ఎంతో మేలు జరగనుంది.