: ఆ యువరాజ్ సరే... ఈ యువరాజ్ కు ఎంత డిమాండో తెలుసా?


యువరాజ్ సింగ్... భారత్ లోని క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఇక రైతుల్లో, ముఖ్యంగా పాడి పశువుల అభివృద్ధి రంగంలో ఉన్నవారికి ఎంతో పరిచితమైన పేరు కూడా యువరాజ్. ఈ యువరాజ్ ఎవరనుకుంటున్నారా? అదో దున్నపోతు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'కృషి ఉన్నతి మేళా'లో ప్రధాన ఆకర్షణ ఇదే. ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతు వీర్యానికి అమితమైన డిమాండ్ ఉండగా, దీని యజమాని కరమ్ వీర్ సింగ్ కు లక్షలాది రూపాయలను సంపాదించి పెడుతోంది. గేదెలకు కృత్రిమ గర్భదారణా పద్ధతులను అవలంబించే వారంతా ఈ యువరాజ్ దగ్గరకే వస్తారట. ఒక్కసారి ఈ దున్నపోతు వీర్యాన్ని వదిలితే 4 నుంచి 6 లక్షల వీర్యకణాలు వస్తాయి. దీంతో 500 నుంచి 600 డోసులు తయారు చేసుకోవచ్చట. ఇక దీన్నే వ్యాపారంగా చేసుకున్న కరమ్ వీర్, లిక్విడ్ నైట్రోజన్ కంటెయినర్లలో యువరాజ్ వీర్యాన్ని నింపి ఒక్కో డోస్ ను రూ. 300కు అమ్ముకుంటున్నారు. సాలీనా రూ. 40 నుంచి రూ. 45 లక్షల వరకూ వీర్యం అమ్మకాల కారణంగానే వస్తోందని ఆయన చెబుతున్నారు. ఇక ఎనిమిదేళ్ల యువరాజ్ ఆహారం కోసం రోజుకు రూ. 3 వేల వరకూ ఖర్చవుతోందని చెప్పారు. అన్నట్టు యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ (క్రికెటర్ యువరాజ్ కెరీర్ చూసి అతని పేరు, అతని తండ్రి పేరు ఆ దున్నపోతులకు పెట్టుకున్నాడు లెండి), తల్లి గంగ కూడా తన వద్దే ఉన్నాయని, యువరాజ్ కు పుట్టిన బర్రెల్లో రోజుకు 26 లీటర్ల పాలిచ్చేవి కూడా ఉన్నాయని సంబరంగా చెబుతున్నారు కరమ్ వీర్ సింగ్.

  • Loading...

More Telugu News