: ప్రైవేటు ప్రాంతాల్లో చేసే వెధవ పనులను నేరమనలేం: బాంబే హైకోర్టు రూలింగ్
ఓ ప్రైవేటు ప్యాలెస్ లో 13 మంది పురుషులు, ఆరుగురు మహిళలు అభ్యంతరకర రీతిలో పట్టుబడిన ఘటనలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత శిక్షాస్మృతి ప్రకారం, ప్రైవేటు భవంతుల్లో జరిగే వెధవ పనులు నేరం కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 294 కింద పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను న్యాయమూర్తులు ఎన్ హెచ్ పాటిల్, ఏఎం బదార్ లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. కాగా, డిసెంబర్ 12న తన పక్కింట్లోని పురుషులు కొంతమంది యువతులను తెచ్చుకుని పార్టీ పెట్టుకున్నారని, వారు నృత్యాలు చేస్తుంటే, డబ్బు వెదజల్లుతుండటం కిటికీలోంచీ కనిపిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు పెట్టారు. మద్యం సేవించిన స్థితిలో ఉన్న 13 మంది పురుషులను, కురచ దుస్తులు ధరించిన ఆరుగురు యువతులను అరెస్ట్ చేశారు. అదేమీ పబ్లిక్ ప్లేస్ కాదని, తమ ప్రైవేటు ప్లేస్ అని నిందితులు వాదించగా, కోర్టు ఏకీభవించింది. ఐపీసీ సెక్షన్ 294 కింద పబ్లిక్ ప్లేసుల్లో జరిగే వ్యవహారాలపైనే విచారించవచ్చని న్యాయమూర్తులు తేల్చారు.