: అరచేతిలో స్వర్గం చూపుతూ నన్నంటారా?: టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ గుత్తా
మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కారు అప్పుల ఊబిలోకి నెడుతోందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, బడ్జెట్ లో మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. డబ్బులు కేటాయించకుండా నీళ్లిస్తాం, ఇళ్లిస్తాం అంటూ కేసీఆర్ అరచేతిలో స్వర్గం చూపుతున్నారని మండిపడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా నిధులు కేటాయించుకున్నారని, తమ వారికి దోచి పెట్టుకునే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తనపై టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, తాను నిధులను ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాసినట్టు చేస్తున్న ఆరోపణలు వాస్తవ దూరమని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి లేఖనూ రాయలేదని గుత్తా స్పష్టం చేశారు. మిషన్ భగీరథపై తనకున్న అనుమానాలనే లేఖలో ప్రస్తావించినట్టు తెలిపారు.