: పెట్రోలు ధర పెరిగే కాలం... 2016 గరిష్ఠానికి క్రూడాయిల్!
పెట్రోలు ధరలు మరింతగా పెరగనున్నాయి. పలు దేశాల నుంచి క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లపై ఒత్తిడి పెరగగా, మూడు వారాల క్రితం వరకూ 35 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 42 డాలర్లు దాటిపోయింది. 2016 సంవత్సరంలో ముడి చమురుకు అత్యధిక ధర పలికింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 65 సెంట్లు పెరిగి 42.19 డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో యూఎస్ క్రూడాయిల్ ధర 58 సెంట్లు పెరిగి 40.78 డాలర్లకు చేరింది. దీంతో కనీసం రెండు నెలల పాటు ముడిచమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించగా, 27 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడాయిల్ ధర తిరిగి పెరగడం ప్రారంభమైంది. కాగా, అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలను అనుసరించి ఇండియాలో పెట్రోలు ధరలను నిర్ణయిస్తున్న ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ)లు పెరుగుతున్న ధరలను నిశితంగా గమనిస్తున్నాయి. దీంతో తమ నష్టాలను పూడ్చుకునేందుకు కంపెనీలు ధరను పెంచనున్నాయని తెలుస్తోంది. ఈ నెలాఖరులో మరో విడత పెట్రోలు, డీజెల్ ధరల పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.