: ఆర్థిక మంత్రి హామీతో 18 రోజుల సమ్మె విరమించిన జ్యూయెలర్స్
గత నెలలో పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా వెండితో తయారైనవి మినహా మిగతా అన్ని రకాల ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాలను పెంచడాన్ని నిరసిస్తూ, 18 రోజులుగా సమ్మె చేస్తున్న జ్యూయెలర్స్ తమ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి వేధింపులూ ఉండబోవని, పెంచిన సుంకాలను మరోసారి పరిశీలిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నుంచి వచ్చిన హామీతో సమ్మెను విరమించినట్టు ఆభరణాల తయారీదారుల సంఘాలు వెల్లడించాయి. కాగా, ఆభరణాలపై ఒక శాతం సుంకాన్ని తీసివేయాలని తాము డిమాండ్ చేశామని, అందుకు జైట్లీ సానుకూలంగా స్పందించారని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ జీవీ శ్రీధర్ వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించిన తరువాత మిగతా అన్ని సంఘాలతో మాట్లాడామని, అందరూ సమ్మె విరమణకు మొగ్గు చూపారని ఆయన అన్నారు. ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కు తీసుకోకపోయినా, తాము లేవనెత్తిన సమస్యలకు జైట్లీ పరిష్కారం చూపుతామన్నారని వివరించారు. కాగా, ఈ 18 రోజుల సమ్మె కారణంగా ఆభరణాల పరిశ్రమకు దాదాపు రూ. 25 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నిపుణులు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఆభరణాల దుకాణాలు మార్చి 2 నుంచి మూతపడ్డాయి. రూ. 2 లక్షలు దాటిన లావాదేవీల విషయంలో పాన్ సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలన్న ప్రభుత్వ నిబంధనను కూడా జ్యూయెలరీ సంఘాలు నిరసించిన సంగతి తెలిసిందే.