: ఎక్కడైనా మా ఓట్లు తగ్గాయా... మీ పని పడతా!: ఐఏఎస్ లకు యూపీ సీఎం వార్నింగ్


దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఎస్పీ ప్రభుత్వం... ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ నిన్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. అయితే, ఎక్కడైనా... ఏ ప్రాంతంలోనైనా మా పార్టీ వోట్ల శాతం తగ్గితే కనుక అక్కడి సంబంధిత అధికారులపై మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకు సిద్ధంగా వుండండి' అంటూ ఆయన చేసిన హెచ్చరికలతో అధికారులు బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత కాస్తంత స్వరం తగ్గించిన అఖిలేశ్... ప్రభుత్వ ప్రాథమ్యాలను పూర్తి చేయడంలో అధికారులదే కీలక భూమిక అన్నారు. అంతేకాక మాయావతి, నరేంద్ర మోదీ సర్కారుల కంటే తానే అధికారులకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చానని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘సర్వీస్ వీక్’ దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News