: ప్రొటెస్ట్ తెలుపుతామన్నా మైకివ్వట్లేదు!... స్పీకర్ కోడెలపై జగన్ నిప్పులు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై సభలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, దానిని కోర్టు ఎత్తివేత, ఆమెను సభలోకి రాకుండా అడ్డగింత... తదితర పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్రగా వెళ్లారు. ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన జగన్... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ వైఖరితో పాటు చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. కోర్టులు సస్పెన్షన్ ఎత్తివేసిన నేపథ్యంలో సభకు వచ్చిన రోజాను అడ్డుకున్న వైనంపై నిరసన తెలుపుతామని కోరినా, తమకు స్పీకర్ మైకివ్వలేదని ఆయన ఆరోపించారు. స్పీకర్ నిర్ణయానికి నిరసనగా సోమవారం దాకా తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని జగన్ ప్రకటించారు.