: వరుణుడు ఇంతటితో కరుణిస్తే సరి... లేదంటే దాయాదుల పోరు రద్దే!: ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ స్టాఫ్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో హై ఓల్టేజీ మ్యాచ్ గా పరిగణిస్తున్న భారత్, పాక్ మ్యాచ్ భవితవ్యం వాన దేవుడి చేతుల్లోకి వెళ్లిపోయింది. రాత్రి మ్యాచ్ జరగాల్సి ఉండగా, నేటి ఉదయం కోల్ కతాలో వరుణుడు గర్జించాడు. నగరాన్ని తడిపేశాడు. వరుణుడి ప్రతాపంతో కోల్ కతా నగరంతో పాటు మ్యాచ్ జరగాల్సిన ఈడెన్ గార్డెన్స్ కూడా చిత్తడిగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితం వరుణుడు కాస్తంత తెరిపి ఇవ్వగా గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని పరిశీలించారు. ఇప్పటిదాకా కురిసిన వర్షంతో పెద్ద ఇబ్బందేమీ లేదని వారు ప్రకటించారు. అయితే వరుణుడు మరోమారు ఉరిమితే మాత్రం చేయగలిగిందేమీ లేదని, మ్యాచ్ రద్దు కాక తప్పదని ప్రకటించారు. దీంతో మ్యాచ్ జరిగేలా చూడాలంటూ అభిమానులంతా వరుణ దేవుడిని వేడుకుంటున్నారు.