: త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి మంచు మోహన్ బాబు!... పుట్టిన రోజున ప్రకటన
టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు... గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. దివంగత నేత పరిటాల రవీంద్ర బతికుండగా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలగిన మోహన్ బాబు, పరిటాల రవి మరణానంతరం రాజకీయాలకు దూరంగా జరిగారు. తదనంతర కాలంలో సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన తాను నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ కార్యకలాపాల పర్యవేక్షణలోనే తలమునకలయ్యారు. తాజాగా నిన్న మోహన్ బాబు తన జన్మదినాన్ని చిత్తూరు జిల్లాలోని శ్రీవిద్యానికేతన్ లో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు దినపత్రికతో మాట్లాడిన సందర్భంగా తిరిగి రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రకటించారు. ‘‘ఒకప్పుడు రాజకీయంగా కొంతమందికి సపోర్ట్ ఇచ్చాను. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీ అనేది అప్పుడే చెబుతా’’ అని మోహన్ బాబు ప్రకటించారు.