: సభపై సభ్యులకు గౌరవం ఉండాలి...చట్టంపై సభకు గౌరవం ఉండాలి: సురేష్ రెడ్డి
శాసనసభపై శాసనసభ్యులకు గౌరవం ఉండాలని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏర్పడ్డ వివాదంపై ఆయన ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో మాట్లాడుతూ, ప్రతి శాసనసభ్యుడికి సభపై గౌరవం ఉండాలని అన్నారు. సభ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించాలని ఆయన చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా శాసనసభ్యుడికి అనిపిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ చట్టంపై శాసనసభకు గౌరవం ఉండాలని ఆయన చెప్పారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ కీలకం అవుతారని ఆయన చెప్పారు. స్పీకర్ నైతికతపై ఇలాంటి సందర్భాల్లోనే వివాదం రేగుతుందని ఆయన చెప్పారు. గతంలో ఇలాంటి ప్రత్యేక వివాదాలు రేగినప్పుడు స్పీకర్ కు ఉన్న అధికారాలను ఎలక్షన్ కమిషన్ కు అప్పగించాలంటూ పెద్ద చర్చ నడిచిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో వివాదానికి తావు లేకుండా స్పీకర్ పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. ఏపీ శాసనసభలో చోటుచేసుకున్న వివాదం పరువు ప్రతిష్ఠల వివాదంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఆయన తెలిపారు. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వమే కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే...అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు. అందుకే చట్టంపై సభకు గౌరవం ఉండాలని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక వివాదంలో పలు కోణాలు ఉన్నాయని, వాటిని మీడియా ముఖంగా చర్చించే కంటే...ఏపీ శాసనసభలో చర్చ తరువాత ఏం జరుగుతుందనేది చూడాలని ఆయన అన్నారు.