: రోజా సమస్యను స్పీకర్ సరిదిద్దే అవకాశం ఉండేది: సురేష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏర్పడిన న్యాయవ్యవస్థ, చట్టసభ వివాదంపై మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి స్పందించారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో పలు సందర్భాల్లో సభ్యులు హద్దులు మీరుతుంటారని అన్నారు. అలాంటి సందర్భాల్లో స్పీకర్ చురుగ్గా స్పందించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో వివాదానికి కారణమైన సభ్యులను స్పీకర్ తన ఛాంబర్ లోకి పిలిపించుకుని చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొంటారని అన్నారు. అలా కూడా పరిష్కారం లభించని పక్షంలో వివాదం సద్దుమణిగేందుకు సభను వాయిదా వేస్తారని, అప్పుడు కూడా సమస్యకు పరిష్కారం దొరకకపోతే సదరు సభ్యులను శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి సూచన మేరకు ఒకటి రెండు రోజులు సస్పెండ్ చేస్తారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చోటుచేసుకున్న అంశాలు విభిన్నమైనవని ఆయన చెప్పారు. రోజా వ్యవహారంలో శాసనసభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్ ప్రతిపాదించక ముందు స్పీకర్ ఈ సమస్యను సరిదిద్దే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.