: ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవం!
ఈ ఏడాది టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవాన్ని ఖమ్మంలో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష, పార్లమెంటరీ పక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ నెల 26న పార్టీ ప్లీనరీ, 27న బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ వార్షికోత్సవం లోపు దేవాలయ, మార్కెట్ కమిటీల భర్తీ పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అర్హులు, ఆశావహుల జాబితాను మంత్రులు, ఎమ్మెల్యేలు పంపించాలని సూచించినట్లు సమాచారం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని పార్టీ నిధి కోసం ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా, పార్టీ కార్యక్రమాల కోసం ఎమ్మెల్సీ సలీం రూ.2 కోట్లు ప్రకటించారు.