: గంట వ్యవధిలో 200 పాయింట్ల లాభం!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సవరించకుండా తీసుకున్న నిర్ణయం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పట్టి ఉంచగా, భారత మార్కెట్ సైతం అదే దారిలో నడిచింది. సెషన్ ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న సూచికలు, చివరి గంట వ్యవధిలో దూసుకెళ్లాయి. యూరప్ మార్కెట్లలో నూతన కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఆ ప్రభావం భారత మార్కెట్లోకి ఎఫ్ఐఐలు మరిన్ని పెట్టుబడులను తీసుకు వచ్చేలా చేసింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో 24,760 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, 3:05 గంటలకు 24,980 పాయింట్లకు చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 275.37 పాయింట్లు పెరిగి 1.12 శాతం లాభంతో 24,952.74 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 91.80 పాయింట్లు పెరిగి 1.22 శాతం లాభంతో 7,604.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.66 శాతం, స్మాల్ క్యాప్ 0.61 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 44 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. వీఈడీఎల్, హిందాల్కో, ఏసీసీ, బోష్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు లాభపడగా, లుపిన్, సన్ ఫార్మా, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,788 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,294 కంపెనీలు లాభాల్లోను, 1,312 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 92,76,638 కోట్లుగా నమోదైంది.