: మాల్యాకు మరింత గడువిచ్చిన ఈడీ
అరెస్టుకు భయపడి లండన్ పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా విచారణకు హాజరయ్యేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరింత సమయం ఇచ్చింది. ముంబైలోని తమ కార్యాలయంలో ఏప్రిల్ 2న హాజరు కావాలని తాజా సమన్లను జారీ చేసింది. ఇటీవల విజయ్ మాల్యా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఇప్పుడే ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని, తనకు మరింత సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత ఇచ్చిన తేదీకి మాల్యా విచారణకు హాజరు కాకపోవడంతోనే, ఆయనకు మరింత సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన న్యాయవాదిని పంపడానికి వీల్లేదని, స్వయంగా హాజరు కావాల్సి వుందని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, మాల్యా నుంచి దేశంలోని బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల వరకూ బకాయిలు రావాల్సి వున్న సంగతి తెలిసిందే.