: నల్లారి 'బంగారుతల్లి'... తెలంగాణలో రద్దు
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మానస పుత్రికగా ప్రారంభమైన పథకం, 'బంగారు తల్లి'ని తెలంగాణలో పూర్తిగా రద్దు చేస్తున్నట్టు టీఆర్ఎస్ సర్కారు ప్రకటించింది. ఈ పథకానికి ప్రజల నుంచి స్పందన లేని కారణంగా, దీని బదులుగా కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని చెబుతూ, బంగారు తల్లిని రద్దు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా, ఆడపిల్లలు జన్మించిన నాటి నుంచి వారికి ఆర్థిక ఆసరాను కల్పించేలా నగదు బదిలీ పథకంగా 'బంగారు తల్లి' ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక కల్యాణలక్ష్మి, పేద యువతి వివాహ సమయంలో ఏక మొత్తంలో నగదును అందించే పథకం. బంగారు తల్లి పథకాన్ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. దీనిలో లోపాలుంటే సరిచేయాలి గానీ, పూర్తిగా రద్దు చేయడం ఏంటని ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి ప్రశ్నించారు.