: ‘సీమ’ డ్రగ్స్... కువైట్ చేరుతున్నాయి!
రాయలసీమ రతనాల సీమగానే మనకు తెలుసు. కరవు సీమగానూ ఈ ప్రాంతానికి పేరుంది. అయితే ఆ సీమ ఇప్పుడు మాదక ద్రవ్యాల ఉత్పత్తి, అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోందట. ప్రధానంగా కడప జిల్లాను కేంద్రంగా చేసుకుని కొన్ని డ్రగ్స్ మాఫియా ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లాలోని కడప, రాజంపేట, సండుపల్లి, ప్రొద్దుటూరు... తదితర పట్టణాల్లో ఇటీవల ఈ డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు పెరిగిపోయాయి. ప్రధానంగా బ్రౌన్ షుగర్ ను తయారుచేస్తున్న ఈ ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా కువైట్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. కడప జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇలా పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళుతున్న వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న ముఠాలు వారి ద్వారానే డ్రగ్స్ ను కువైట్ తరలిస్తున్నాయట. ఈ క్రమంలో కువైట్ లో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన పలువురు మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజంపేట, సండుపల్లిల్లో పోలీసులు చేసిన సోదాల్లో పెద్ద మొత్తంలో బ్రౌన్ షుగర్ దొరికింది. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ చేదు నిజాలు వెలుగుచూశాయి.