: పోలీసులపై విరుచుకుపడ్డ నిరుద్యోగులు... ర్యాలీని అడ్డుకున్నారని రాళ్ల దాడి
ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగుల చలో అసెంబ్లీ హింసాత్మకంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తమను అడ్డుకున్నారంటూ ఆగ్రహావేశాలకు గురైన నిరుద్యోగులు పోలీసులపై రాళ్లతో విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ముట్టడించేందుకు ఓయూ నుంచి నిరుద్యోగుల ర్యాలీ ప్రారంభం కాగా... ఆదిలోనే ఎన్ సీసీ గేటు వద్ద పోలీసుల బారికేడ్లు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన నిరుద్యోగులు పోలీసులపై రాళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మరిన్ని బలగాలు అక్కడికి చేరుకుని నిరుద్యోగులను అరెస్ట్ చేశాయి.