: వెనక్కు తగ్గే సమస్యే లేదు... న్యాయం జరిగే దాకా పోరు సాగిస్తాం!: వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో న్యాయం జరిగే దాకా పోరు సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని కూడా జగన్ చెప్పారు. శాసనసభను ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుందని ఆయన ధ్వజమెత్తారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తన పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన జగన్... రాజ్ భవన్ వద్దే మీడియాతో మాట్లాడారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్... నిబంధనలకు విరుద్ధంగా అధికార పక్షం పక్షాన నిలబడుతున్నారన్నారు. కోర్టు ఆదేశాలను స్పీకర్ బేఖాతరు చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబుతో పాటు స్పీకర్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, స్పీకర్ టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పీకర్ తో చేతులు కలిపిన చంద్రబాబు... తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూస్తున్నారన్నారు. అవిశ్వాసంపై కనీసం విప్ కూడా జారీ చేసే అవకాశం ఇవ్వకుండా తీర్మానాలపై చర్చ, ఓటింగ్ పెడుతున్నారని నిందించారు. 14 రోజుల తర్వాత చర్చకు అనుమతించాల్సిన అవిశ్వాస తీర్మానాన్ని గంటల్లోనే ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు.