: 'ఫేస్ బుక్ లైక్'లపై ఎస్బీఐ ఫుల్ పేజీ అడ్వర్టయిజ్ మెంట్లు... కడిగిపారేస్తున్న నెటిజన్లు!


వేల కోట్ల రూపాయల రుణాలిచ్చి వాటిని వసూలు చేసుకోవడంలో విఫలమై, విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో తమకు 50 లక్షల లైక్ లు వచ్చాయని చెబుతూ బ్యాంకు ఫుల్ పేజీ ప్రకటనలను దినపత్రికల్లో ఇవ్వగా, నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. కింగ్ ఫిషర్ కు భారీ రుణాలిచ్చి, ఆపై సకాలంలో స్పందించక, మాల్యా విదేశాలకు పారిపోయిన తరుణంలో 'ఫేస్ బుక్ లైక్' అంటూ కోట్లాది రూపాయలతో ప్రకటనలు ఎందుకని బ్యాంకును ప్రశ్నిస్తున్నారు. మాల్యా సంస్థలు రూ. 1,600 కోట్లను ఎస్బీఐ కి చెల్లించాల్సి వున్నాయన్న సంగతి తెలిసిందే. "ఐదు మిలియన్ల లైకులు... మాల్యా నుంచి 16,230 మిలియన్ల మొండి బకాయి.." అని ఒకరంటే, "వావ్... ఎస్బీఐకి ఫేస్ బుక్ లైక్ లు మైల్ స్టోనా? ఇందుకు ఫుల్ పేజీ యాడ్లా. వారి బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడితే బాగుంటుందేమో" ని ఇంకొకరు, "ఇక ట్విట్టర్ ఖాతా గురించి కూడా మాట్లాడండి... కనీసం పత్రికలు కాస్త బాగుపడతాయి" అని మరొకరు, "50 లక్షల ఫాలోవర్లా... వీరితో బ్యాంకు నిజంగా సంబంధాలు నడుపుతున్నది ఎంతమందితో?"... ఇలా సాగుతున్నాయి ఎస్బీఐపై ట్వీట్ల విమర్శలు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో బ్యాంకుల మొండి బకాయిలు రూ. లక్ష కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఐడీబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా ఎన్నో సంస్థల ఈక్విటీలు నేల చూపులు చూస్తున్నాయి.

  • Loading...

More Telugu News