: ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సరిచేసుకునే అవకాశం!: టీడీపీ నిర్ణయంపై రోజా కామెంట్
తనపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ సర్కారు నిర్ణయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జి్ల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానం ఆవేశపూరితంగా తీసుకున్నదేనని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుతో ఆవేశంలో తీసుకున్న సదరు నిర్ణయాన్ని సరిచేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని కూడా ఆమె అన్నారు. కొద్దిసేపటి క్రితం లాయర్లతో కలిసి అసెంబ్లీకి వచ్చిన రోజాను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం తర్వాత రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించిన పోలీసులు సభలోకి మాత్రం అనుమతించలేదు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరిస్తుందని తాను భావించడం లేదని ఆమె అన్నారు.