: రోజాను అడ్డుకోండి!... స్పీకర్ కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి మార్షల్స్!
ఏపీ అసెంబ్లీలో నేడు హైటెన్షన్ వాతావరణం తప్పేలా లేదు. తనపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ పై న్యాయపోరాటం సాగించిన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... బహిష్కరణను ఎత్తివేయించుకున్నారు. ఈ మేరకు ఆమెకు అనుకూలంగా తీర్పు చెబుతూ నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులోని సింగిల్ జడ్జి ధర్మాసనం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. రూల్ 320 ప్రకారం ఏ చట్ట సభ సభ్యుడిని కూడా ఏడాది పాటు సస్పెండ్ చేయడం కుదరదని కోర్టు తెగేసి చెప్పింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కోర్టు తీర్పు కాపీతో నిన్న సాయంత్రానికే రోజా అసెంబ్లీకి చేరిపోయారు. అయితే అప్పటికే అసెంబ్లీ వాయిదా పడటంతో ఆమె వెనుదిరిగారు. నేటి సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానని ఆమె ప్రకటించారు. మరోపక్క, కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న సర్కారు... ఆ మేరకు అసెంబ్లీ కార్యదర్శితో డివిజన్ బెంచ్ లో నిన్ననే పిటిషన్ దాఖలు చేయించింది. దీనిపై కోర్టు తుది నిర్ణయం ప్రకటించేదాకా రోజాను సభలోకి అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి మార్షల్స్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వరాదన్న స్పీకర్ కార్యాలయం ఆదేశాలతో పెద్ద సంఖ్యలో మార్షల్స్ రంగంలోకి దిగారు. దీంతో సభ ప్రారంభానికి ముందే సభా ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.