: యూబీ చైర్మన్ పదవి నుంచి మాల్యాకు ఉద్వాసన?... పావులు కదుపుతున్న హెనాకిన్
అప్పుల ఊబిలో కూరుకుపోయి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరింత మేర గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ లో మాల్యా ఇష్టపడి కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు డైరెక్టర్ పదవి నుంచి ఆయన తప్పుకోక తప్పలేదు. ఇక దేశంలోనే ఓ విజయవంతమైన వ్యాపారవేత్తగా మాల్యాను నిలబెట్టిన ‘యునైటెడ్ బ్రూవరీస్’ చైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్ చేరిన మాల్యాను యూబీ చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు కంపెనీలో 42.2 శాతం వాటా ఉన్న డచ్ సంస్థ ‘హెనాకిన్’ పావులు కదుపుతోంది. స్కాటిష్ అండ్ న్యూకాజిల్ అనే సంస్థను 2008లో టేకోవర్ చేయడం ద్వారా ఆ సంస్థలకు యూబీలో ఉన్న 37.5 శాతం వాటాను దక్కించుకున్న హెనాకిన్... తదనంతర కాలంలో తన వాటాను 42.2 శాతానికి పెంచుకుంది. తాజాగా మాల్యా విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో యూబీని పూర్తిగా తన అధీనంలోకి తీసుకునేందుకు ఆ సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది.