: తుది శ్వాస దాకా సీమ అభివృద్ధికే కృషి!: కడప జిల్లాలో బాలయ్య ఉద్ఘాటన
రాయలసీమ అభివృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యమని టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. నిన్న తన సొంత నియోజకవర్గానికి పొరుగుననే ఉన్న కడప జిల్లా పర్యటనకు వెళ్లిన బాలయ్య... బ్రహ్మంగారి మఠం, సిద్ధయ్యగారి మఠం తదతరాలను సందర్శించుకున్నారు. అంతకుముందు ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లిన బాలయ్య... అక్కడ రాములోరిని దర్శించుకుని సిద్ధయ్యగారి మఠంకు వెళుతున్న క్రమంలో బద్వేలులో ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తన తుదిశ్వాస దాకా రాయలసీమ అభివృద్ధికి పాటుపడతానని బాలయ్య పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర’ చిత్రంలో సిద్ధయ్యగా నటించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చిన సందర్భంగానే తెలుగు గంగ పథకానికి అంకురార్పణ జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని బాలయ్య పేర్కొన్నారు.