: రాణించిన ఆఫ్ఘన్ కెప్టెన్...లంక లక్ష్యం 154


తొలి టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు సత్తాచాటింది. జట్టు కెప్టెన్ అస్గర్ స్టానిక్జాయ్ (62) రాణించడంతో శ్రీలంక జట్టుకు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్ ఆదిలో కాస్త తడబడ్డప్పటికీ తర్వాత ఊపందుకున్నారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లే రాణించినప్పటికీ మెరుగైన లక్ష్యాన్ని లంకేయుల ముందుంచారు. తొలి 10.3 ఓవర్లలో కేవలం 50 పరుగులు మాత్రమే చేసిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు, తరువాతి 9 ఓవర్లలో రెచ్చిపోయారు. టీ20లకు తగ్గ ఆటతీరుతో 9.3 ఓవర్లలో 103 పరుగులు సాధించి 154 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్ లో కెప్టెన్ అస్టర్ స్టానిక్జాయ్ తో పాటు నూర్ అలీ జరాదన్ (20), షమియుల్లా షెన్వారీ (31) అద్భుతంగా రాణించారు. చివర్లో నజీబుల్లా జద్రాన్ (12) ఆకట్టుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో పెరీరా మూడు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో హెరాత్, చెరో వికెట్ తీసి మాథ్యూస్, కులశేఖర చక్కని సహకారమందించారు. 154 పరుగుల విజయ లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News