: ఈ నెల 23న కన్నయ్య మధ్యంతర బెయిలు రద్దు పిటిషన్లపై విచారణ
దేశద్రోహం ఆరోపణలపై అరెస్టై, బెయిలుపై విడుదలైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 23న విచారణ జరపనుంది. ఈనెల 2న ఢిల్లీ హైకోర్టు కన్నయ్యకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీన్ని రద్దు చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. కాగా, న్యాయస్థానం బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈనెల 23న విచారించాలని నిర్ణయించినప్పటికీ, పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఒకరైన న్యాయవాది ఎల్‌పీ లుథ్రా.. బెయిలు రద్దు అత్యవసర అంశంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 21న విచారణ జరపాలని విన్నవించారు. కానీ అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ రద్దును కోరిన మరో పిటిషనర్ వినీత్ జిందాల్ స్పందిస్తూ.. కన్నయ్య విడుదల అనంతరం చేసిన ప్రసంగాలు బెయిల్ నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై కన్నయ్యపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.