: రోజా వ్యవహారంపై డివిజన్ బెంచ్ కు ఏపీ సర్కారు!... ప్రొసీజరల్ మిస్టేక్స్ ను కోర్టులు తప్పు పట్టలేవని వాదన


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజాపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నేటి ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ లతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికాసేపట్లో ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టలేవన్న వాదనను ప్రభుత్వం ప్రస్తావించనుంది. అంతేకాక ప్రోసీజరల్ మిస్టేక్స్ ను ఆధారం చేసుకుని సభ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవని కూడా ప్రభుత్వం కాస్తంత గట్టిగానే తన వాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News