: ఏపీ అసెంబ్లీలో ‘విశాఖ కుక్కల గోల’!... సభ్యులను కడుపుబ్బా నవ్వించిన విష్ణుకుమార్ రాజు
ఏపీ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం ‘కుక్కల గోల’ చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన తర్వాత మారిన నిబంధనల మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ప్రస్తావించిన ‘విశాఖలో కుక్కల గోల’ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ నగరంలో ఏకంగా 1,00,395 కుక్కలు ఉన్నాయని చెప్పారు. కుక్కల కారణంగా జనం బెంబేలెత్తుతున్నారని చెప్పిన ఆయన, కుక్కల బెడద నుంచి జనాన్ని రక్షించాలని కోరారు. ఓ సందర్భంలో తనను కూడా ఓ కుక్క కరవబోయిందని, తాను ఎలాగోలా తప్పించుకున్నానని ఆయన చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ‘కుక్కల గోల’పై విష్ణు కుమార్ రాజు చేసిన ప్రసంగంతో సభ్యులతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా కడుపుబ్బా నవ్వారు.