: మనకన్నా ఎక్కువ ఆనందంగా పాక్, బంగ్లాదేశ్ ప్రజలు!
ఇండియాలోని ప్రజలు ఆనందంగా గడపడం లేదు. ఈ నెల 20న ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా, అత్యధికంగా ఆనందంగా ఉన్న దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, భారత్ కన్నా పాక్, బంగ్లాదేశ్, చైనా, పాలస్తీనా, ఇరాన్ దేశాలు ముందు నిలవడం గమనార్హం. కాగా, గత సంవత్సరం ఇదే జాబితాలో తొలి స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్, ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. తొలి స్థానాన్ని డెన్మార్క్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 9, అమెరికా 13వ స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సోమాలియా (76), చైనా (83), పాకిస్థాన్ (92), ఇరాన్ (105), పాలస్తీనా (108), బంగ్లాదేశ్ (110) నిలువగా, భారత్ 117వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అతి తక్కువ ఆనందాన్ని అనుభవిస్తూ, జీవితాలు గడుపుతున్న దేశాల్లో రువాండా, బెనిన్, ఆఫ్గనిస్థాన్, సిరియా, బురండిలు ఉన్నాయి. మొత్తం 156 దేశాల్లోని సామాజిక పరిస్థితులు, ప్రజారోగ్యం, పాలనా విధానం, సంపద పంపిణీ తదితర వివరాలను క్రోడీకరించి ఈ జాబితాను తయారు చేసినట్టు ఐరాస అనుబంధ సంస్థ ఎస్డీఎస్ఎస్ పేర్కొంది.