: చనిపోదామని కొండపై నుంచి దూకితే... చెట్టు కొమ్మలు ఒడిసిపట్టేశాయి!


నిజంగా ఆ చిన్నారి ప్రాణం గట్టిదే. ఆత్మహత్య చేసుకుందామని ఏకంగా కొండపై నుంచి దూకితే... కింద ఉన్న ఓ చెట్టు కొమ్మలు ఆ చిన్నారిని ఒడిసిపట్టేశాయి. దీంతో చనిపోదామనుకున్న ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఆసక్తికర ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగెం కొండ సమీపంలో నిన్న చోటుచేసుకుంది. కుటుంబంలో చిన్నపాటి ఘర్షణకే కలత చెందిన ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని చనిపోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా, ఇంటిలో నుంచి బయటకు వచ్చేసిన ఆ బాలిక కొండపైకి చేరుకుని కిందకు దూకేసింది. అయితే ఆ బాలిక కింద పడే క్రమంలో చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో విద్యార్థిని వేసిన కేకలు విన్న స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పరుగు పరుగున వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆ చిన్నారిని క్షేమంగా చెట్టు కొమ్మల మధ్య నుంచి కిందకు దించి ఇంటికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News