: ‘కురుడు’ పేరిట తమిళనాట సజీవంగానే ‘ఎల్టీటీఈ’ పొట్టు అమ్మన్!... సింహళ పత్రిక సంచలన కథనం
శ్రీలంకలో తమిళుల అస్తిత్వం కోసం ఏళ్ల తరబడి పోరు సాగించిన ‘లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్టీటీ)’... అక్కడ అంతర్యుద్ధానికే తెర తీసింది. దశాబ్దాల పాటు కొనసాగిన ఈ అంతర్యుద్ధంలో ‘పెద్ద పులి’గా పేరుగాంచిన ఆ సంస్థ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ కు పొట్టు అమ్మన్ కుడి భుజం. సంస్థ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రచారం పొందిన పొట్టు అమ్మన్... ఎల్టీటీఈ సేకరించిన కీలక సమాచారానికి ఆయనే కర్త, కర్మ, క్రియ. గూఢచర్యంలో ఆరితేరిన పొట్టు అమ్మన్ ను మట్టుబెట్టేశామంటూ లంక ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మహీంద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఈ ఘటన జరిగిందని ప్రపంచానికి తెలుసు. అయితే పొట్టు అమ్మన్ చనిపోలేదని, భార్యాపిల్లలతో సజీవంగానే ఉన్నాడంటూ శ్రీలంకకు చెందిన ఓ పత్రిక నిన్న సంచలన కధనాన్ని ప్రచురించింది. పొట్టు అమ్మన్ చనిపోయాడని ప్రకటించిన లంక ప్రభుత్వం... అతడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం జారీ చేయలేదు. ఈ ఒక్క చిన్న అంశాన్ని ఆధారం చేసుకుని లంక పత్రిక తాజాగా సంచలన కథనాన్ని రాసినట్లు తెలుస్తోంది. శ్రీలంక సైనిక బలగాల ముప్పేట దాడిలో ప్రభాకరన్ చనిపోగా, పొట్టు అమ్మన్ మాత్రం ఆ దేశాన్ని వదిలేసి, భారత్ లోని తమిళనాడు రాష్ట్రం చేరుకున్నారన్నది ఆ కథనం సారాశం. ప్రస్తుతం తమిళనాడులోని ఓ ప్రాంతంలో ‘కురుడు’ అనే మారు పేరుతో పొట్టు అమ్మన్ స్వేచ్ఛగా జీవిస్తున్నాడని ఆ కథనం పేర్కొంది. ఈ కథనం అటు శ్రీలంకలోనే కాక తమిళనాడులోనూ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.