: నోరు జారి నాలిక్కరుచుకున్న సోనియా గాంధీ!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న నోరు జారారు. సొంత పార్టీ నేతృత్వంలో పదేళ్ల పాటు దేశాన్ని ఏలిన యూపీఏ ప్రభుత్వంపై ఆమె నిందలు మోపారు. ఆ విషయాన్ని వెనువెంటనే గుర్తించి నాలిక్కరుచుకున్నారు. వివరాల్లోకెళితే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన మట్టి సత్యాగ్రహం మూడు రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన ప్రతినిధి బృందం నిన్న దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ... కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఎన్డీఏ సర్కారుపై ఒంటికాలిపై లేచారు. ఈ సందర్భంగా ‘ఎన్డీఏ’ సర్కారు అనబోయిన ఆమె ‘యూపీఏ’ సర్కారు అనేశారు. ‘‘ఏపీకి యూపీఏ సర్కారు చేసిందేమీ లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ పొరపాటును వెనువెంటనే గుర్తించిన ఆమె సదరు వ్యాఖ్యలను సరిచేసి... ఏపీకి ఎన్డీఏ సర్కారు చేసిందేమీ లేదని మోదీ సర్కారుపై నిందలు వేశారు.