: రోజా కేసులో వాదనలు పూర్తి, తీర్పు రేపటికి వాయిదా
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా పడింది. కాగా,340 నిబంధన కింద తీర్మానం పెట్టి సస్పెండ్ చేశారని, కానీ, ఆ నిబంధనలో వున్న అసలు విషయాన్ని మరుస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టం ప్రకారం ఉండాలని కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వినిపించిన వాదనల విషయానికొస్తే..340వ నిబంధన ప్రకారం కేవలం ఒక సెషన్ కే సస్పెండ్ చేయవచ్చని, ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే రోజాపై చర్య తీసుకున్నారని ఆమె వాదిస్తూ, 340 నిబంధన తనకు తెలియదని యనమల అనడం సరికాదన్న విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ‘యనమల’కు అన్ని నిబంధనలపై అవగాహన ఉందని, 340 నిబంధన కింద ఏడాదిపాటు సస్పెన్షన్ కుదరదని ఆమె వాదించారు. ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా తనకు ఉందని సభ అనుకుందా? ప్రతిపక్షం మొత్తాన్ని ఐదేళ్ల పాటు బయటకు పంపడాన్ని అనుతిద్దామా? అంటూ రోజా తరపు న్యాయవాది కోర్టులో ప్రశ్నించారు. సభను సజావుగా నడపడానికే 340 నిబంధన ఉందన్న విషయం మరిచిపోకూడదని, రోజా పేరును తీర్మానంలో మెన్షన్ చేయలేదని, వివరణ ఇచ్చుకునే అవకాశం ఆమెకు ఇవ్వలేదని, ఏ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఇది బాధ్యత లేని నిర్ణయమని, తుది ఉత్తర్వులు వచ్చే వరకూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, అసెంబ్లీకి వెళ్లే అవకాశం రోజాకు కల్పించాలని రోజా తరపు న్యాయవాది విన్నవించుకున్నట్లు సమాచారం.