: ప్రత్యేక హోదాపై హామీలను నెరవేర్చని ప్రభుత్వం, ఏపీకి మట్టి, నీరు మాత్రమే ఇచ్చింది!: సోనియా, రాహుల్
ఏపీకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాను, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ను ఏపీ కాంగ్రెస్ నేతలు ఈరోజు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సేకరించిన కోటి సంతకాల పత్రాలను వారికి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా ప్రధానిపై ఒత్తిడి తెస్తామన్నారు. ఏపీ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. విభజన చట్టంలో ఏపీకి పలు హామీలు ఇచ్చామని, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని సోనియా అన్నారు. అయితే, రెండేళ్లు గడుస్తున్నా ఏపీకి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని సోనియా విమర్శించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని తాము పోరాడుతున్నామన్నారు. ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ముంచారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.