: భారత్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన న్యూజిలాండ్
స్వదేశంలో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్ అనుకున్న భారత క్రికెట్ జట్టు తొలి మ్యాచులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన ముందు తలవొంచింది. సూపర్ 10లో భాగంగా మంగళవారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన మొదటి మ్యాచులో భారత జట్టుపై న్యూజిలాండ్ 47 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ పూర్ పిచ్ ను పరిశీలించిన తర్వాత న్యూజిలాండ్ తెలివిగా వ్యవహరించింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగుల స్కోరు సాధించింది. 127 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన న్యూజిలాండ్ స్పిన్నర్ల ప్రతిభ ముందు ధాటిగా ఆడలేకపోయింది. స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో... ధోనీ ఒంటరిగా 30 పరుగులు చేసినప్పటికీ... 18.1ఓవర్లలో 79 పరుగులకే భారత ఆట ముగిసింది. కోహ్లి 23 పరుగులు, అశ్విన్ 10 పరుగులను మినహాయిస్తే ఎవరూ కనీసం రెండంకెల పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ధోనీ, కోహ్లి, అశ్విన్ వీరు ముగ్గురూ కలిపి 63 పరుగుల చేయగా... మిగిలిన వారందరూ 16 పరుగుల్లోనే పెవిలియన్ బాట పట్టారంటే వారి నిలకడలేమిని తెలియజేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ శాంటనర్ ఒక్కడే నాలుగు వికెట్లు తీసుకుని భారత విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. శాంటనర్ కు తోడుగా సోది మూడు వికెట్లు, మెక్ కల్లమ్ రెండు వికెట్లు తీసుకుని భారత్ ను కట్టడి చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఆండర్సన్ 34 పరుగులతో అధిక స్కోరర్ గా నిలిచాడు. అయితే, 47 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడిపోవడం కప్ విజయావకాశాలను దెబ్బతీసే పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుధవారం ఇంగ్లండ్ జట్టు గ్రూప్ 1లో వెస్టిండీస్ తో ముంబైలో తలపడనుండగా.... కోల్ కతాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మధ్య మరో పోటీ జరగనుంది.