: బంగ్లాదేశ్‌లో బ్యాంకు నుంచి 540 కోట్ల రూపాయలు మాయం!
బంగ్లాదేశ్‌లో సెంట్రల్ బ్యాంకు నుంచి రూ. 540 కోట్లు (40 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టడం కలకలం రేకెత్తిస్తోంది. ఈ అంశం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ ద్వారా చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు రాబరీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అతివుర్ రహ్మాన్ తన పదవికి రాజీనామా చేసినట్టు బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి మంగళవారం వెల్లడించారు. హ్యాకర్ల నుంచి భారీగా సొమ్ము రికవరీ చేశామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నేరగాళ్ల నుంచి దోపిడీకి గురైన మిగతా డబ్బు కూడా రాబట్టేందుకు ఫిలిపీన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. తమ అమెరికా ఖాతాలోని బిలియన్ డాలర్ల (రూ. 6,740 కోట్ల)ను దోచుకోవడానికి హ్యాకర్లు ప్రయత్నించారని, ఈ దోపిడీని చాలావరకు నిరోధించామని బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు చెబుతోంది. ఈ వ్యవహారంలో అమెరికా రిజర్వు బ్యాంకు సిస్టం సరిగ్గా పనిచేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, ఆ బ్యాంకు అధికార్లు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.