: మరో 500 ఔషధాలను నిషేధించే దిశగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కొద్ది రోజుల క్రితమే దేశవ్యాప్తంగా చలామణి అవుతున్న 344 కాంబినేషన్ ఔషధాలపై నిషేధం విధించిన భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో 500 ఔషధాలను బ్యాన్ చేసే దిశగా యోచిస్తోంది. నిషేధించిన వాటిలో పలు రకాల దగ్గు మందు కాంబినేషన్లు వున్నాయి. ఈ ఔషధాలు సురక్షితం కావని, రోగికి అంతగా సహకరించవని నిపుణులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందులతో పాటు 344రకాల ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) ఔషధాలపై నిషేధం విధించారు. తాజాగా 6,000 ప్రోడక్ట్‌లను పరీక్ష చేస్తున్నారు. వాటిలో కనీసం 1,000 ఔషధాల్లో ఎఫ్‌డీసీ తీవ్రంగా ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వాటిలో సుమారు 500 ఔషధాలను నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధించాలనుకుంటున్న ఔషధాలను రెండో దశలోనూ పరీక్షించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో పలు యాంటీబయాటిక్స్, యాంటీ డయాబెటెస్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. పలు మందుల వాడకంతో అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఆమోదించారు. ప్రముఖ సైంటిస్టుల పరిశోధనల్లో ఆయా ఔషధాలు హాని కలిగించేవిగా నిర్థారించారని, అనేక పరీక్షల అనంతరమే నిషేధం అమల్లోకి తేనున్నట్లు తెలిపారు.