: చంద్రబాబును చూస్తుంటే ఆనందంగా ఉంది: వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యంగ్యం


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని చూస్తుంటే తనకు ఆనందం కలుగుతోందని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభిస్తూ మాట్లాడిన ఆయన, "అధ్యక్షా... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాకు పెద్దన్న వంటి వారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న ఆయన్ను చూస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నాలుగంటే నాలుగు ఆచరణ సాధ్యం కాని హామీలను ఆయనిచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. అందుకు ఆనందం" అనడంతో వైకాపా నేతలు చప్పట్లు కొట్టడం కనిపించింది. తమ పార్టీ సభ్యురాలు రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేసిన ఆయన, ఒకవేళ రోజా అభ్యంతరకర మాటలు మాట్లాడారనే అనుకున్నా, చంద్రబాబు అంతకుమించిన పరుష పదజాలం వాడారని ఆరోపించారు. "నీ అంతు చూస్తానని ఆయనన్నా చర్యలు లేవు. ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యేను చంపేస్తానని అన్న వ్యాఖ్యలు రికార్డుల్లో ఉన్నాయి. వాటిపై చర్యలు లేవు. అందుకే ఈ అవిశ్వాస తీర్మానం" అన్నారు.

  • Loading...

More Telugu News