: ఫిరాయింపుదారులను కాపాడుకునేందుకు నిమిషాల్లో రూల్స్ మార్చేసిన బాబు సర్కారు...అవాక్కయిన జగన్!
వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆపై తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన వారిని అనర్హులుగా ప్రకటింపజేయాలన్న వైకాపా అధినేత జగన్ ఎత్తులు మరోసారి చిత్తయ్యాయి. నిన్న అవిశ్వాస తీర్మానం ఇవ్వగా, ఆ వెంటనే చర్చను చేపట్టి, విప్ జారీ చేసే సమయం కూడా ఇవ్వని చంద్రబాబు సర్కారు, నేడు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సందర్భంగా అసెంబ్లీ రూల్స్ నే మార్చేసింది. స్పీకర్ పై అవిశ్వాసాన్ని పెడితే, కనీసం 14 రోజుల తరువాతనే చర్చను జరపాలని నిబంధనల్లో స్పష్టంగా ఉన్న విషయాన్ని జగన్ ప్రస్తావిస్తూ, తమ సభ్యులకు విప్ జారీ చేసే సమయం ఇవ్వాలని కోరగా, యనమల స్పందించారు. ఆ నిబంధన ఉన్న రూల్స్ ను తొలగిస్తున్నట్టు తీర్మానాన్ని ప్రతిపాదించగా, మూజువాణీ ఓటుతో ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో, జగన్ అవాక్కయ్యారు. అంతకుముందు యనమల మాట్లాడుతూ, "రూల్స్ మాకు తెలియనివి కావు. అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్. ప్రతిపక్ష నేత మరోసారి చేతులు కాల్చుకుంటున్నారు. రూల్ 358 కింద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఆసెంబ్లీ, ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతోంది. రూల్ 71-2, రూల్ 72-3లను సస్పెండ్ చేయాలని కోరుతున్నాను" అన్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందిందని, జగన్ ప్రస్తావించిన రూల్స్ వర్తించవని స్పీకర్ కోడెల స్పష్టం చేయడంతో జగన్ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆపై యనమల మరోసారి మాట్లాడుతూ, "సభ సజావుగా సాగేలా చూసేందుకు ఎలాంటి రూల్స్ నైనా మార్చే అధికారం సభకు ఉంది. ఆయన ఏ రూల్స్ అయితే ప్రస్తావించారో అవి చెల్లవు. అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరగాలి. కనీసం 2 గంటలు కేటాయిస్తారని భావిస్తున్నాం. రాజకీయంగా చూస్తే, మీరు నోటీసు ఇచ్చారు. దానికి కట్టుబడి వుండాలి. చర్చిద్దామంటే వెనక్కు ఎందుకు పారిపోతున్నారు? వద్దని ఎందుకంటున్నారు? మీకెందుకు బాధ?" అని అన్నారు. కాగా, నేడు కూడా పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలూ హాజరు కాలేదు.