: ట్విట్టర్ లో మరోమారు మాల్యా ప్రత్యక్షం!... ‘సండే గార్డియన్’ ఇంటర్వ్యూపై విస్మయం
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టి ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మాల్యా విదేశాలకు పారిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తా కధనాలు ప్రచురితమైన నేపథ్యంలో గత వారం ట్విట్టర్ లో ప్రత్యక్షమైన మాల్యా... తానెక్కడికీ పారిపోలేదని, వ్యాపార పని నిమిత్తమే విదేశీ పర్యటనకు వెళ్లానని చెప్పారు. ఆ తర్వాత ఇక తాను ఇప్పుడిప్పుడే భారత్ రాలేనని రెండు రోజుల క్రితం ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన మరోమారు ట్విట్టర్ లోనే ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల తాను ‘సండే గార్డియన్’ పత్రికకు ఇచ్చినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఇంటర్వ్యూపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తాను సదరు పత్రిక ప్రతినిధికి ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆయన తేల్చిచెప్పారు. అంతేకాకుండా ‘ప్రోటాన్ మెయిల్ అకౌంట్’ ద్వారా తనను ఇంటర్వ్యూ చేశానన్న సదరు పత్రిక వాదనను ఆయన ఖండించారు. అసలు ప్రోటాన్ మెయిల్ అకౌంట్ తనకు లేదని, అసలు అదేంటో కూడా తనకు తెలియదని మాల్యా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన వరుసగా మూడు ట్వీట్లను పోస్ట్ చేశారు.