: న్యాయశాఖ ఆ పని మీదే ఉంది: హోదాపై లోక్ సభలో రాజ్ నాథ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చట్టంలో ప్రత్యేక హోదాపై ఒక్క మాటను కూడా చేర్చని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిలా రాద్ధాంతం చేయడం తగదని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని తమకూ ఉందని, అయితే, అది అనేకాంశాలతో కూడుకున్నదని తెలిపారు. ఈ విషయమై న్యాయశాఖ పనిచేస్తోందని, న్యాయశాఖ సిఫార్సుల మేరకు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఆపై పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విభజన చట్టాన్ని అమలు చేయడం లేదన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఇప్పటికే రాష్ట్రానికి ఐఐటీ, ఎయిమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఇరిగేషన్ రీసెర్చ్, ఎన్ఐఐటీ, పోలవరం ప్రాజెక్టు, నేషనల్ కాంపిటేటివ్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లను మంజూరు చేశామని గుర్తు చేశారు. తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లామని, అమరావతి సమీపంలోని విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కాకినాడ కంటెయినర్ కార్పొరేషన్ పనులు జరుగుతున్నాయని, రూ. 65 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులను మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారని తెలిపారు. విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేశామని వివరించారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి గుంటూరు, విజయవాడల అభివృద్ధికి రూ. 500 కోట్ల చొప్పున కేటాయించామన్నారు. వైజాగ్, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా నిర్ణయించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి మండళ్లుగా గుర్తించామని వెంకయ్య తెలిపారు. ఇంత అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుంటే, ఈ వ్యతిరేకత ఏంటని ప్రశ్నించారు.