: ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు: కేవీపీ ఉద్వేగ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పటికీ, విభజన అనంతరం ఏర్పడిన రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలిందని రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయినా, ప్రత్యేక హోదా వచ్చి, ఆపై పరిశ్రమలు ఏర్పడి అభివృద్ధి చెందవచ్చని భావించిన ఆంధ్రుల ఆశలపై మోదీ ప్రభుత్వం నీళ్లు చల్లుతుందని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికీ ప్రత్యేక హోదాపై ప్రజలు ఆశగా ఉన్నారని, వారి ఆశలను తీర్చి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. హోదా అంశం కేంద్ర పరిధిలో ఉన్నందున, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తక్షణం ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల ఆందోళన మిన్నంటిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.