: విపక్ష ఎమ్మెల్సీ ప్రసంగానికి ముగ్ధుడైన చంద్రబాబు... ఏలూరు ఆసుపత్రి చైర్మన్ పదవిని గిఫ్ట్ గా ఇచ్చిన వైనం


ఓ వైపు ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు సీఎం చంద్రబాబునాయుడిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న చంద్రబాబు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా అసెంబ్లీలో నిత్యం కనిపిస్తున్న దృశ్యం. అయితే విపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్సీ తన ప్రసంగంతో చంద్రబాబు మనసును గెలుచుకున్నారు. సదరు ఎమ్మెల్సీ ప్రసంగానికి ముగ్ధుడైన చంద్రబాబు... అక్కడికక్కడే ఓ ప్రభుత్వ ఆసుపత్రి సలహా మండలి చైర్మన్ పదవిలో ఆయనను నియమించారు. ఈ ఆసక్తికర ఘటన నిన్న అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... కొంతకాలం క్రితం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి మంచి పట్టున్న పశ్చిమగోదావరి జిల్లా స్థానం నుంచి పీడీఎఫ్ కు చెందిన రాము సూర్యారావు (మాస్టారు) ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన టీడీపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సూర్యారావు చేతిలో మట్టి కరచింది. ఇదంతా గతం. నిన్న కామన్వెల్త్ డే సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖులంతా ప్రసంగించిన అనంతరం సూర్యారావు మాట్లాడారు. ‘‘ఎన్నికల వరకే విభేదాలు. తర్వాత అందరూ కలిసి ఉండాలని గాంధీ అన్నారు. రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా జరిగింది. ముఖ్యమంత్రి ఇన్ని కష్టాల మధ్య ఎలా పాలన చేస్తున్నారో తెలియడం లేదు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పెళ్లిళ్లకు, తిరుపతి హుండీలకు, చర్చిలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు పేదల ఆరోగ్యానికో, సంక్షేమానికో వెచ్చిస్తే బాగుంటుంది’’ అని ఆయన తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పారు. సూర్యారావు సుదీర్ఘ ప్రసంగాన్ని మండలి చైర్మన్ చక్రపాణి ఆక్షేపించినా, చంద్రబాబు మాత్రం స్వాగతించారు. సూర్యారావు ఆవేదనను చక్రపాణి గమనించినట్లు లేదని చంద్రబాబు చమత్కరించారు. ఆ వెంటనే పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి సలహా మండలి చైర్మన్ గా సూర్యారావును నియమిస్తున్నట్లు చంద్రబాబు అక్కడికక్కడే ప్రకటించారు.

  • Loading...

More Telugu News