: కెల్లాగ్స్ ప్రొడక్టుల తయారీ బెల్ట్ పై మూత్ర విసర్జన... వీడియో వెలుగులోకి


కెల్లాగ్స్... ప్రపంచవ్యాప్తంగా చాకోస్ నుంచి రైస్ క్రిస్పీస్, గ్రానోలా క్లస్టర్స్ తదితర పదుల కొద్దీ ఇన్ స్టంట్ ఫుడ్ ను తయారు చేస్తున్న సంస్థ. ఈ సంస్థకు సంబంధించిన 43 సెకన్ల వీడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం కలిగించింది. కెల్లాగ్స్ ఉత్పత్తులు తయారయ్యే కన్వేయర్ బెల్టుపై ఒక వ్యక్తి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ, దాన్ని వీడియో తీశాడు. ఇది కెల్లాగ్స్ ఉత్పత్తులను వాడుతున్న వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సంస్థ ఉత్పత్తుల అమ్మకాలు ఒక్కరోజులో 50 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో సంస్థ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటన మెంఫిస్ లోని సంస్థ ప్లాంటులో జరిగిందని భావిస్తున్నామని సంస్థ ప్రతినిధి క్రిస్ చార్లెస్ 'వాషింగ్టన్ పోస్ట్'కు వెల్లడించారు. ఇక్కడ రైస్ ఆధారిత ఉత్పత్తులు తయారవుతాయని తెలిపిన ఆయన, ఈ వీడియో తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని, తామెంతో బాధపడ్డామని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిందని తెలియగానే, అంతర్గత విచారణకు ఆదేశించామన్నారు. తమ సంస్థలో ఆహార నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. కాగా, సంస్థలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య గొడవలు జరిగిన 2014లో ఈ వీడియోను తీసుండవచ్చని, దాన్ని ఇప్పుడు బయటకు వదిలారని భావిస్తున్నారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు కాగా, విచారణకు సహకరిస్తామని చార్లెస్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News