: జేఎన్యూ నుంచి కన్నయ్య కుమార్ సహా ఐదుగురి బహిష్కరణకు సిఫార్సులు


జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చిన విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సహా ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను యూనివర్శిటీ నుంచి బహిష్కరించాలని, మొత్తం ఘటనలపై వేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులపై వైస్ చాన్స్ లర్ ఎం జగదీశ్ కుమార్, చీఫ్ ప్రాక్టర్ ఏ దిమ్రీలు నిర్ణయం తీసుకోవాల్సి వుందని, కమిటీ సిఫార్సులనే వీరు ఆమోదించవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఐదుగురు విద్యార్థులూ యూనివర్శిటీ నుంచి బహిష్కరణ శిక్షను ఎదుర్కోక తప్పదు. కమిటీ నివేదిక ఇప్పటికే వైస్ చాన్స్ లర్ కార్యాలయానికి చేరగా, దీనిపై ముఖ్య అధికారులు చర్చించినట్టు సమాచారం. విద్యార్థుల బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే, మరిన్ని గొడవలు రావచ్చని కొందరు పెద్దలు అభిప్రాయపడగా, వీరు వర్శిటీ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించారని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలంటే, కఠినంగా వ్యవహరించాల్సిందేనని మరికొందరు సూచించారని తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 10వ తేదీన ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ, దాదాపు నెల రోజుల పాటు విచారణ జరిపి ఈ నివేదిక ఇచ్చిందని వర్శిటీ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలపై మరోసారి విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News