: ధనుంజయ ట్రావెల్స్ నిర్లక్ష్యం... మెడికోల పాలిట శాపంగా మారింది!


కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి ‘ధనుంజయ ట్రావెల్స్’ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను తప్పించమన్న విద్యార్థుల విజ్ఞప్తిని ట్రావెల్స్ యాజమాన్యం పెడచెవిన పెట్టడం, బస్సు నిలపాలన్న విద్యార్థుల అభ్యర్థనను డ్రైవర్ వినకుండా వేగంగా దూసుకెళ్లడం వంటి కారణాలే ఈ ఘటనకు దారి తీసిందని గాయాలపాలైన విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఓ విద్యార్థి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం... విజయవాడ సమీపంలో భోజనానికి బస్సు ఆగిన సమయంలో విద్యార్థులంతా కిందకు దిగారు. ఆ సమయంలో బస్సులోని విద్యార్థుల బ్యాగుల నుంచి పలు విలువైన వస్తువులను బస్సు క్లీనర్ తస్కరించాడు. దీనిని గమనించిన విద్యార్థులు అతడితో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో మద్యం సేవించి వచ్చిన డ్రైవర్ ను బస్సు నడపొద్దని విద్యార్థులు వారించారు. అంతేకాక ట్రావెల్స్ యాజమాన్యానికి మద్యం తాగిన డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. వేరే డ్రైవర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి యాజమాన్యం సరిగ్గా స్పందించలేదు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బస్సు ఎక్కాడు. ఆ తర్వాత బస్సు ఎక్కిన విద్యార్థులు క్లీనర్ తో వాగ్వాదానికి దిగారు. ఓ వైపు బస్సులో వాగ్వాదం జరుగుతుండగానే డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. అయితే బస్సును నిలిపివేయాలని విద్యార్థులు డ్రైవర్ కు మొరపెట్టుకున్నారు. అయినా వినకుండా డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు కదిలించాడు. ఈ క్రమంలోనే చెట్టును ఢీకొన్న బస్సు బోల్తా కొట్టింది. ఘోర ప్రమాదం సంభవించింది. నలుగురు మెడికోలతో పాటు విద్యార్థుల మాటలను పెడచెవిన పెట్టిన డ్రైవర్ కూడా చనిపోయాడు.

  • Loading...

More Telugu News