: ఏపీలో నలుగురు టీఎస్ మెడికోల మృత్యువాత!... ట్రావెల్స్ బస్సు బోల్తా, 31 మందికి గాయాలు


నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే... హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్న 46 మంది విద్యార్థుల బృందం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ కు వెళ్లింది. నాలుగు రోజుల అనంతరం నిన్న సాయంత్రం హైదరాబాదుకు తిరుగు పయనమైంది. విద్యార్థులను తీసుకువస్తున్న ధనుంజయ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద చెట్టును ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మెడికోలు గిరిలక్ష్మణ్, విజయ్ తేజా, ప్రణవ్, విజయ్ కృష్ణలతో పాటు బస్సు డ్రైవర్ కూడా అక్కడిక్కడే చనిపోయారు. మరో 31 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, వైద్య సిబ్బంది క్షతగాత్రులను గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై టీఎస్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వేగంగా స్పందించారు. నేటి తెల్లవారుజాముననే ఆయన ఘటనా స్థలికి బయలుదేరారు.

  • Loading...

More Telugu News